సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) అనుబంధ సింగరేణి కోల్ మెన్స్ కార్మిక సంఘ్ నిరంతరం పోరాడుతుందని, బీఎంఎస్ అనుబంధ అఖిల భారతీయ ఖదన్ మజ్దూర్ సంఘ్ (ఏబీకేఎంఎస్) జాతీయ కార్యవర్గ సభ్యుడు మండ రమాకాంత్, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్యలు తెలిపారు.
ఆదివారం జిల్లాలోని నస్పూర్ ప్రెస్ క్లబ్లో శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల బీఎంఎస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏబీకేఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు మండ రమాకాంత్, రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జూన్ 7న భూపాలపల్లిలో జరగనున్న 29వ ద్వైవార్షిక మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు. కోల్ ఇండియా తరహాలో సింగరేణి కార్మికులకు అలవెన్సులపై ఆదాయపు పన్ను రీయింబర్స్మెంట్ చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన విద్యుత్ బొగ్గు బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బొగ్గు గని కార్మికుల 12వ వేజ్ బోర్డు అమలుకు బీఎంఎస్ ప్రత్యేక కృషి చేస్తోందని, జూలై 1 నుంచి కొత్త వేజ్ బోర్డు అమల్లోకి రానున్న నేపథ్యంలో కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే జేజిసిసిఐ కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యాన్ని నిర్మూలించేందుకు మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తామని, కొత్త బొగ్గు గనుల ప్రారంభానికి ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు.
గతంలో అమలులో ఉన్న కార్పొరేట్ మెడికల్ బోర్డును యథావిధిగా కొనసాగించాలని వారు కోరారు. అనంతరం బీఎంఎస్ యూనియన్ 2026-28 కాలానికి శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల నూతన కమిటీని సభ్యుల సమక్షంలో ప్రకటించారు. మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడిగా గుర్రం ప్రదీప్ కుమార్, కార్యదర్శిగా చెట్టి వీరన్న, కోశాధికారిగా కిషన్ లు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.








