రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంట కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ను ఆయన పరిశీలించి, అధికారులను నిలదీశారు.
సారంగాపూర్ మార్కెట్ యార్డ్ లో కుప్పలుగా పడి ఉన్న మొక్కజొన్నను చూసిన ఆయన, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మొక్కజొన్న కొనుగోలులో జాప్యం, వరి ధాన్యం కోతకు రావడం, అకాల వర్షాల భయం వంటి అంశాలపై రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే గన్ని బ్యాగులు, రవాణా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించిన ఏలేటి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







