పంట అవశేషాలను తగులబెట్టడం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తు తరాల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్ హెచ్చరించారు. ప్రతి గ్రామంలో దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి, రైతుల్లో అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎల్కాతుర్తిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, రైతులు పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వరి కొయ్యలు, మొక్కజొన్న చొప్పలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. “పర్యావరణాన్ని కాపాడుకుందాం – ఆరోగ్యంగా జీవిద్దాం” అనే నినాదంతో రైతుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమిలోని సేంద్రీయ కర్బనం, మిత్ర పురుగులు నశించి నేల సారం దెబ్బతింటుందని భాస్కర్ తెలిపారు. అంతేకాకుండా, పొగ కారణంగా వాయు కాలుష్యం పెరిగి, ప్రజల్లో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుందని ఆయన పేర్కొన్నారు.
పంట వ్యర్థాలను రైతులు ఆధునిక పద్ధతుల్లో వినియోగించుకోవాలని, హార్వెస్టర్ల ద్వారా పొడి చేసి భూమిలో కలియదున్నడం, కంపోస్ట్ ఎరువుగా తయారు చేయడం, మల్చింగ్ విధానంలో నేల తేమను కాపాడడం, పుట్టగొడుగుల పెంపకానికి వరి గడ్డిని వినియోగించడం వంటి మార్గాలను ఆయన వివరించారు. ఈ సందేశం ప్రతి రైతుకు చేరేలా గ్రామాల్లో టమ్టమ్ ద్వారా చాటింపు వేయించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులు, రైతు సంఘాలు, గ్రామస్థులు కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.








