సంగారెడ్డి, 2026-11-27
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి బి.ఎం.సందీప్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తల పనితీరును గుర్తించాలని, ప్రజలకు, కార్యకర్తలకు చేయాల్సిన పనుల్లో ఏవైనా పెండింగ్లో ఉంటే పరిశీలించి పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. తనకు పార్టీ పరంగా ఎలాంటి ఫిర్యాదులు లేవని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఉక్కుపాదం మోపుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. విద్యాసంస్థల్లోనూ డ్రగ్స్ వినియోగం బయటపడితే ఎంతటి వారినైనా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. నార్కోటిక్స్, ఈగల్ బృందాలతో పాటు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి డ్రగ్స్ సరఫరా, విక్రయాల కట్టడికి చర్యలు చేపట్టారని తెలిపారు. సినీ ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి డ్రగ్స్, గంజాయిపై చర్యలు చేపడుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇప్పుడు పాదయాత్ర చేయాలనే ఆలోచన రావడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రజా సమస్యల కోసం కాదని, కేవలం ఎన్నికల స్టంట్, ప్రచార ఆర్భాటం మాత్రమేనని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కాలేరంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని జగ్గారెడ్డి అన్నారు. ప్రధాని పదవి అనేది రాహుల్ గాంధీ కుటుంబానికి కొత్త కాదని, బీజేపీ నేతలకు పదవులు కొత్త కావచ్చేమో కానీ రాహుల్ గాంధీకి కాదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ నాయకులు పని చేస్తున్నారని తెలిపారు. డీలిమిటేషన్ జరగకపోతే 14, జరిగితే 20 ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ముందుగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే ఏలేటి మహేశ్వర్రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయాలని హితవు పలికారు.

