నారాయణఖేడ్, 2026-11-27
విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో పాటు విద్యార్థుల హాజరు నమోదులో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుజాల్ పూర్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలు జ్యోతి రాథోడ్‌ను జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) ఆర్. రోహిణి సస్పెండ్ చేశారు. ఈ నెల 26న డీఈఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముఖ గుర్తింపు హాజరు విధానం (ఎఫ్ఆర్ఎస్)లో 12 మంది విద్యార్థులు హాజరైనట్లు నమోదు కాగా, పాఠశాలలో మాత్రం ఐదుగురు విద్యార్థులే ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా సమీపంలోని మదర్సాలో చదువుతున్న కొందరు విద్యార్థుల హాజరును జుజాల్ పూర్ పాఠశాల విద్యార్థులుగా తప్పుగా నమోదు చేస్తున్నట్లు తనిఖీలో వెల్లడైంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలు కూడా ఆశించిన స్థాయిలో లేవని గుర్తించారు. ఈ నేపథ్యంలో విధుల పట్ల నిర్లక్ష్యం, హాజరు నమోదులో అక్రమాలపై క్రమశిక్షణా చర్యలు చేపట్టిన డీఈఓ ఉపాధ్యాయురాలిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయి విచారణ ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.






