అమెరికా, ఇజ్రాయెల్ సహా పలు దేశాల్లో ప్రశంసలు అందుకున్న భారత సంతతికి చెందిన ఫ్లై దుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్‌కు తగిలిన గాయాలు తొలిసారిగా స్పష్టంగా కనిపించాయి. యూఏఈలో జరిగిన సత్కార కార్యక్రమంలో ఆయన తలపై కుట్లు, గాయాల గుర్తులు కనిపించడంతో ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రయాణికుల భద్రత కోసం ఆయన చూపిన ధైర్యసాహసాలకు యూఏఈ ప్రభుత్వం గౌరవ పురస్కారాన్ని అందించింది.
తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు ప్రయత్నించారు. దీంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడికి పాల్పడిన సహ పైలట్‌ను అదుపులోకి తీసుకునేందుకు సహకరించారు. విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్లు బాధ్యతలు చేపట్టి, సౌదీ అరేబియాలోని తబూక్లో విమానాన్ని సురక్షితంగా దించారు. అనంతరం స్మిత్‌కు తొలుత తబూక్లో చికిత్స అందించి, తర్వాత అబుదాబికి తరలించారు.
యూఏఈ అత్యున్నత గౌరవం
విమానంలోని ప్రయాణికుల భద్రత కోసం స్మిత్, ఇతర సిబ్బంది చేసిన కృషిని గుర్తించిన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారికి ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దుబాయ్ యువరాజు, ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ అల్ మక్తూమ్ ఈ పురస్కారాలను అందజేశారు. సిబ్బంది ధైర్యం, వృత్తిపరమైన నిబద్ధతను అధికారులు ప్రశంసించారు.
అధ్యక్షుడితో స్మిత్ సంభాషణ
సత్కార కార్యక్రమంలో స్మిత్‌తో యూఏఈ అధ్యక్షుడు ఆప్యాయంగా మాట్లాడిన వీడియో కూడా వైరల్ అయింది. ఆయన తలపై గాయాలను పరిశీలించి, చేతికి ఉన్న కట్టు గురించి అడిగారు. తాను పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలలు పట్టవచ్చని స్మిత్ చెప్పినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. కోలుకున్న తర్వాత తనతో కలిసి పోరాట కళల్లో శిక్షణ తీసుకోవాలని ఉందని అధ్యక్షుడు సరదాగా చెప్పడంతో ఇద్దరూ నవ్వుకున్నారు. ఈ సంభాషణ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఈ ఘటనపై సహ పైలట్ దాడికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. దర్యాప్తు కొనసాగుతుండగా, స్మిత్ గాయాల దృశ్యాలు విమానంలో జరిగిన ప్రమాద తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.

