దేశ ప్రజల కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం సంగారెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐబీ గెస్ట్‌హౌస్ నుంచి ఓల్డ్ బస్టాండ్‌లోని అంబేద్కర్ చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ర్యాలీ పొడవునా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి, మోడీ డౌన్ డౌన్, రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ చౌక్‌కు చేరుకున్న అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారని, ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఢిల్లీ రోడ్లపై పోరాడుతుంటే మనం ఇళ్లలో విశ్రాంతి తీసుకోవడం సరైనదేనా ఆయనకు మద్దతుగా మనమందరం వీధుల్లోకి రావాల్సిందే అని అన్నారు. తాను ఢిల్లీ వెళ్లగలిగినప్పటికీ, రాహుల్ గాంధీ పోరాటానికి స్థానికంగా సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలోనే ఉండి ర్యాలీ నిర్వహించినట్లు వివరించారు.
ఓట్ల చోరీ జరుగుతోందని, బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ అంశాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కనీసం పది మందికి వివరించి, ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమని రాహుల్ గాంధీ ప్రకటించారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆ డిమాండ్ నెరవేరే వరకు సంగారెడ్డిలోనూ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపితే, మనం కూడా అదే విధంగా ఆయనకు మద్దతుగా నిలవాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


