సంగారెడ్డి గంజ్ మైదాన్ ప్రాంతంలో మిర్చీలు అమ్ముతున్న చిరు వ్యాపారితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముచ్చటించారు. దుకాణం బాగా నడుపుకోవాలని, అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తూ, ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది.
సంగారెడ్డి గంజ్ మైదాన్ ప్రాంతాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం పరిశీలించారు. తన కుమారుడి వివాహ వేడుక ఏర్పాట్లకు సంబంధించి గంజ్ మైదాన్ లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఆయన చర్చించారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న కల్లు కాంపౌండ్ లోకి వెళ్లి, అక్కడ మిర్చీలు అమ్ముతున్న వ్యక్తితో సరదాగా ముచ్చటించారు.
గతంలో సైకిల్ పుల్లలకు మాంసం పెట్టి, సీకులు కాల్చి ఇచ్చేవారని, ఇప్పుడు సీకులు తయారు చేయడం లేదని, మిర్చీలు అమ్ముతున్నానని ఆ చిరు వ్యాపారి తెలిపారు. దీనిపై స్పందించిన జగ్గారెడ్డి, అమ్మ ఎలా ఉంది అని అడిగారు. దుకాణం బాగా అభివృద్ధి చేసుకోవడానికి కూడా సహాయం చేస్తానన్నారు.
అమ్మను చూసుకోవాలని సూచన
ఇంతలో పక్కనున్న వ్యక్తి ఒకరు, అమ్మను సరిగా చూసుకోమని అతడికి చెప్పమని జగ్గారెడ్డికి సూచించారు. ఈ విషయమై స్పందించిన జగ్గారెడ్డి, అమ్మను మంచిగా చూసుకోవడానికి మీకు ఏం ఇబ్బంది అని ప్రశ్నించారు. ఇదిగో ఈ రూ.10వేలు తీసుకోండి. దుకాణంలోకి కావాల్సిన వస్తువులు తెచ్చుకోండి. దుకాణం బాగా నడుపుకోండి. అమ్మను మంచిగా చూసుకోండి. అమ్మను పట్టించుకోవడం లేదని నాకు తెలిస్తే ఇబ్బందులు తప్పవు అని సుతిమెత్తగా హెచ్చరించారు.












