మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా బిజెపి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫూలే సేవలను ఆయన కొనియాడారు.
బిజెపి మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రముఖ సామాజిక సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు జ్యోతిబా ఫూలే గారి సేవలు సమాజానికి చిరస్మరణీయమని అన్నారు. ఆయన విద్య, మహిళా సాధికారత, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని తెలిపారు.
ఫూలే సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి, కుల నిర్మూలనకు కృషి చేశారని, సామాజిక సమానత్వానికి విద్యే మార్గమని నమ్మి, తన సతీమణి సావిత్రి బాయి తో కలిసి స్త్రీ విద్య కోసం, వెనుకబడిన తరగతుల కోసం పాఠశాలలు స్థాపించారని పేర్కొన్నారు. బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించిన ఆయన, వితంతువుల కోసం ప్రత్యేక గృహాన్ని కూడా స్థాపించారని తెలిపారు.
భారతదేశ బాలికల కోసం పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి భారతీయులలో జ్యోతిబాపూలే మరియు సావిత్రిబాయి పూలే ఉన్నారని, విద్య ప్రాముఖ్యతను, సామాజిక సంస్కరణల దిశగా కృషి చేసినందుకు ఆయనకు మహాత్మా బిరుదు లభించిందని వివరించారు. నేటి మహిళల పురోగతికి పూలే కృషి కారణమని అన్నారు.
మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలకు అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా పనిచేస్తోందని, చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం దీనికి నిదర్శనమని వెంకటేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.








