కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉగ్రవాదిగా సంబోధించిన వ్యాఖ్యలను నిరసిస్తూ, మంచిర్యాలలో బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సంఘటనతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
మంచిర్యాల ఐబి చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో, ప్రధాని మోడీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బిజెపి మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు దేశ ప్రజలను అవమానించడమేనని అన్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం పురోగమిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మూడుసార్లు ఓడించినా, ఆ పార్టీకి బుద్ధి రాలేదని విమర్శించారు. బిజెపి మరియు ప్రధాని మోడీపై బురద చల్లే ప్రయత్నాలు వికటిస్తాయని ఆయన అన్నారు.
1975లో ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను కాంగ్రెస్ హింసకు గురి చేసిందని, ఆ చరిత్రను ప్రజలు మర్చిపోలేదని రాజు కుమార్ గుర్తు చేశారు. భవిష్యత్తులో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, ఎన్నికల ద్వారా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి నాయకులు కుర్రే చక్రవర్తి, నాగరాజు, పల్లి రాకేష్, కర్రే లచన్న, రెడ్డిమళ్ల అశోక్, మొరడికొండ శ్రీనివాస్, పచ్చ వేంకటేశ్వర్లు, రౌతు వెంకటేశం, మీనా సూరీ, కావేటి మనీష్, రవీందర్ యాదవ్, మణికంఠ, సాయి తదితరులు పాల్గొన్నారు.









