తెలంగాణ రాష్ట్రానికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో నష్టం వాటిల్లుతుందని, ఉత్తరాన రాజకీయ పెత్తనం పెరిగి, దక్షిణాదిలో సీట్ల సంఖ్య తగ్గడం వల్ల రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ వంశీ ఆరోపించారు. మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు.
ఎంపీ వంశీ మాట్లాడుతూ, అనేక విషయాల్లో బీజేపీ ఒంటెద్దు పోకడలను అవలంబిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు 9 విమానాశ్రయాలు మంజూరు చేస్తూ, తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపడం కేంద్ర వైఖరికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పేదలను పీడిస్తూ, కార్పొరేట్లకు పట్టం కడుతోందని ఎంపీ వంశీ ఆరోపించారు. ఈ విధానాలు దేశానికి మంచివి కావని ఆయన అభిప్రాయపడ్డారు.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కేంద్రం కుట్ర చేస్తోందని, దీనివల్ల దక్షిణ భారతదేశంలో రాజకీయంగా ప్రభావం తగ్గే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.












