ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను స్వయంగా ఆలకించిన కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను పంపి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సత్వర పరిష్కారం సూచించారు. జిల్లా ప్రజావాణి దరఖాస్తులతో పాటు, పెండింగ్‌లో ఉన్న సీఎం ప్రజావాణి దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 81 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో కలెక్టరేట్‌కు 53, సంగారెడ్డి డివిజన్‌కు 22, నారాయణఖేడ్ డివిజన్‌కు 5, జహీరాబాద్ డివిజన్‌కు 1 వినతి అందగా, అందోల్ డివిజన్‌కు ఎలాంటి వినతులు అందలేదని వెల్లడించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, బీసీ సంక్షేమాధికారి జగదీష్, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, పీడీ గృహనిర్మాణ శాఖ చలపతిరావు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ఎస్.బి. రామాచారి, జిల్లా సంక్షేమాధికారిణి లలిత కుమారి, అదనపు డీఆర్డీఓ బాలరాజ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.












