కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు చేస్తున్న దాడులను నిలిపి వేయాలని, గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కల్లు గీత కార్మికులను ఇబ్బందులకు గురి చేసే విధంగా దాడులు చేయడం ఆపాలని కోరారు. గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపుల నిర్వాహకులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమేష్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆశన్నగౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లాగౌడ్, ప్రధాన కార్యదర్శి లచ్చ గౌడ్, సంగారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి వెంకటేశంగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాజన్నగౌడ్, సాయన్న గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ గౌడ్, మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


