జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు లతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 60 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
వివిధ మండలాల నుండి వచ్చిన అర్జిదారులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కన్నేపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం సంతోష్, తమ కుటుంబానికి తాతల నుండి వస్తున్న భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని, దీనిపై విచారణ జరిపి పట్టాను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. లక్షెట్టిపేట మండలం పోతపల్లి (అంకతపల్లి) గ్రామానికి చెందిన ఆపు నూరి రాయలింగు, తన భూమి రికార్డులలో పొరపాటు నమోదైందని, సవరించి పట్టా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాజీపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన మెండ్రపు లక్ష్మి, తన భర్త మరణానంతరం ఆయన తమ్ముడు భూమిని అక్రమంగా పట్టా చేసుకుని ప్రభుత్వ లబ్ధి పొందుతున్నారని, తనకు రావలసిన వాటాను ఇప్పించాలని కోరారు. బెల్లంపల్లి మాజీ కో ఆప్షన్ సభ్యుడు అన్వర్ ఖాన్, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్ స్థలం కబ్జా విషయంలో హైకోర్టు డిస్పోస్ ఆర్డర్ అమలు పరచాలని అభ్యర్థించారు. చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన అయిత రామ్ రెడ్డి, తన భూమి నూతన రికార్డు పుస్తకంలో నమోదు కాలేదని, నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
చెన్నూర్ మండల కేంద్రానికి చెందిన పిల్లల మర్రి సంధ్య, తాను వికలాంగురాలని, వితంతువునని, ఇల్లు నిర్మించుకునేందుకు స్థలాన్ని కేటాయించాలని కోరారు. మందమరి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన చాట్ల సుగుణ, వంశపారంపర్యంగా వస్తున్న భూమిలో నిర్మించుకున్న ఇంటికి నెంబర్, ఎన్.ఓ.సి. ఇప్పించాలని అర్జీ సమర్పించారు. మందమర్రి మండలం ఊరు మందమర్రి గ్రామానికి చెందిన పల్లె మల్లేష్, ఉట్నూర్ ట్రైబల్ కోర్టులో కేసు కొనసాగుతున్న భూమికి సంబంధించి జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.












