రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం-2026 బిల్లును ఆమోదించి, అమలులోకి తీసుకురావడంతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం న్యాయవాదులకు రక్షణ కల్పిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
మందమర్రి ఐఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు, న్యాయవాది వడ్లకొండ రంజిత్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో న్యాయవాదులపై జరిగిన దాడులను, వారి ప్రాణనష్టాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎన్నో ఏళ్లుగా ఈ రక్షణ చట్టం కోసం పోరాడుతున్నారని తెలిపారు.
పెద్దపల్లి న్యాయవాది దంపతుల హత్య సంఘటన నేపథ్యంలో, న్యాయవాద సంఘాల విజ్ఞప్తుల మేరకు, టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ కృషి ఫలితంగా ఈ చట్టం అమలులోకి వచ్చిందని రంజిత్ గౌడ్ వివరించారు.
ఈ చట్టం ప్రకారం, న్యాయవాదులపై దాడి, దుర్భాషలాడటం, బెదిరింపులకు పాల్పడితే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.








