తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో మంచిర్యాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాలపై, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. సున్నం బట్టి ప్రాంతంలోని బీజేపీ కార్యాలయంలో సీనియర్ నాయకులు మున్నారాజ సిసోడియా జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంచిర్యాల్ మెయిన్ చౌరస్తాలో మైనార్టీ మోర్చా నాయకులు కూడా జెండా ఆవిష్కరణ చేపట్టారు.
అనంతరం, అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మున్నారాజ సిసోడియా, తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ, యువకులు, విద్యార్థులు, ఉద్యోగుల త్యాగాలు, ఉద్యమాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరిందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పుట్టినరోజున మొదటగా ప్రకటించినట్లుగా కట్టుబడి ఉంటే, వందలాది మంది అమరులు అయ్యేవారు కాదని, వారి మరణాలకు కాంగ్రెస్ పార్టీనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
భారత పార్లమెంటులో అప్పటి బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్, తెలంగాణలో విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసుకోకూడదని, తెలంగాణ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని పార్లమెంటులో గళం విప్పి, అధికార పార్టీ కాంగ్రెస్ను ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేశారని, ఆమెకు యావత్ తెలంగాణ ప్రజానీకం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో ఏర్పడిన తెలంగాణలో గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా అవినీతికి, దోపిడీకి, పీడనకు, అక్రమాలకు, విధ్వంసానికి గురైందని ఆరోపించారు. అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరింత దిగజారుడు రాజకీయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను ఆగమాగం చేస్తూ పాలన కొనసాగిస్తుందని విమర్శించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రితో పాటు, చాలామంది తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినవారే ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నారని, వీరంతా ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి, రాబోయే రోజుల్లో కేంద్రంలో అవినీతికి తావులేకుండా నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీకి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిలబడి, డబుల్ ఇంజిన్ సర్కార్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ పాలన కొనసాగే అవకాశం ఉంటుందని, తద్వారా నీళ్లు, నిధులు, నియామకాలు క్రమపద్ధతిలో పరిపాలన కొనసాగుతుందని అన్నారు. కాబట్టి ప్రజలు చైతన్యంగా ఉండి, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.












