జర్మనీలో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో, కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి మంగళవారం హానోవర్ నగరంలో German Federal Employment Agency అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో, తెలంగాణ నుంచి జర్మనీకి నైపుణ్యం కలిగిన మానవ వనరుల సరఫరాకు సంబంధించిన అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా జర్మనీలో నైపుణ్య కార్మికుల కొరత ఉన్న రంగాలపై దృష్టి సారించారు. జర్మన్ ఉద్యోగ మార్కెట్ అవసరాలను తీర్చడానికి తెలంగాణ యువత నైపుణ్యాలు, భాషా శిక్షణ, సర్టిఫికేషన్ ప్రక్రియలపై సమీక్ష జరిగింది.
మంత్రి వివేక్, తెలంగాణ ప్రభుత్వం యువతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. Telangana Overseas Manpower Company (TOMCOM) ద్వారా నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తూ, గ్లోబల్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (LETF) ఎం. దానా కిషోర్, టామ్కామ్ జనరల్ మేనేజర్ నాగభారతి, మేనేజర్ అనిల్ కుమార్, పీఎంయూ హెడ్ శ్రీనివాస్ రావు, స్కిల్ టాలెంట్ అక్విజిషన్ హెడ్ బాలా రమణి, శ్రీమతి సరోజ గారు పాల్గొన్నారు. ఈ చర్చలు తెలంగాణ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించడంలో కీలకమైనవిగా భావిస్తున్నారు.
సమావేశం అనంతరం, జర్మన్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీలో ఎర్లీ కెరీర్ కౌన్సెలింగ్ విభాగం అధిపతి లారా బ్రైట్సామీటర్ను మంత్రి మరియు ప్రతినిధి బృందం సన్మానించారు.








