జైపూర్ మండలంలో గురువారం మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) శ్రీపతి బాపురావు పర్యటించి, రామారావుపేట, ఇందారం, ఎల్కంటి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కూలీల సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, చలివేంద్రాల నిర్వహణ వంటి అంశాలపై ఆయన అధికారులకు సూచనలు అందించారు.
మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు గురువారం రామారావుపేట, ఇందారం, ఎల్కంటి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పని ప్రదేశాల్లో కూలీలకు నీడ, త్రాగునీరు అందించాలని మరియు కూలీల సంఖ్య పెంచాలని కార్యదర్శులను ఆదేశించారు.
నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్ బిల్లుల వివరాలను హౌసింగ్ శాఖకు పంపాలని సూచించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లోని చలివేంద్రాల్లో చల్లని నీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
పంచాయతీ రికార్డులను పరిశీలించి, యాప్ ఇన్స్పెక్టన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ పర్యటనలో సర్పంచ్ పులి రాజశేఖర్, కార్యదర్శులు సురేష్, ప్రశాంత్, శ్రీనివాస్ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.











