రాష్ట్రంలోని ముదిరాజ్ లను బీసీ 'ఏ' కేటగిరీలోకి మార్చాలని కోరుతూ పలువురు నాయకులు, ప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ శేషాద్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు వారు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రిజర్వేషన్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముదిరాజ్ లకు ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో జారీ చేసిన జీవో ఎంఎస్ 15 ద్వారా ముదిరాజ్ లను బీసీ 'ఏ'లో చేర్చినప్పటికీ, వివిధ కారణాల వల్ల అది అమలు కాలేదని వారు తెలిపారు.
ఈ అంశంపై 2022 నవంబర్ 11న సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు బీసీ కమిషన్లకు ముదిరాజ్ ల సామాజిక స్థితిగతులపై సర్వే నిర్వహించి, వారిని బీసీ 'ఏ'లో చేర్చాలని ఆదేశించినట్లు వారు వివరించారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగలేదని ఆరోపించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2024లో నిర్వహించిన SEEEPC సర్వే ఆధారంగా, ముదిరాజ్ ల సీబీఐ స్కోర్ 94గా నమోదైందని, వెనుకబడిన తరగతుల్లో (బీసీ) ముదిరాజ్ లు, షెడ్యూల్డ్ కులాల్లో (ఎస్సీ) మాదిగలతో సమానంగా ఉన్నారని పేర్కొన్నారని తెలిపారు. ఈ సర్వే నివేదిక ముదిరాజ్ లు బీసీ 'ఏ'లో చేరడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నారని స్పష్టం చేస్తోందని వారు అభిప్రాయపడ్డారు.












