రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు సాగుతూ, సంస్థకు గణనీయమైన ఆర్థిక లబ్ధిని అందిస్తోంది. మిగులు సౌర విద్యుత్తును నిల్వ చేసుకొని, అవసరమైనప్పుడు వినియోగించుకునే ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటికే రూ.25 లక్షలకు పైగా ఆదా అయినట్లు తెలుస్తోంది.
సింగరేణి సంస్థలో ఏర్పాటు చేసిన 1 మెగావాట్ సామర్థ్యం గల బీఈఎస్ఎస్, పగటిపూట ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తులో వినియోగించబడని మిగులు విద్యుత్తును గ్రిడ్‌కు ఉచితంగా సరఫరా చేయకుండా, బ్యాటరీలలో నిల్వ చేసి, అవసరమైనప్పుడు వాడుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును నాలుగు నెలల క్రితం మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌కు అనుబంధంగా రూ.2.5 కోట్ల వ్యయంతో నెలకొల్పారు.
రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్న నేపథ్యంలో, సింగరేణి సంస్థ ఇప్పటికే 8 చోట్ల 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో ఇన్ హౌజ్ ప్లాంట్ల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును స్థానిక అవసరాలకు వాడుకున్న తర్వాత మిగిలిన విద్యుత్తును తెలంగాణ విద్యుత్ శాఖ గ్రిడ్లకు అనుసంధానం చేసినప్పటికీ, ఒప్పందం ప్రకారం తెలంగాణ డిస్కం ఎటువంటి చెల్లింపులు జరపదు. ఈ మిగులు విద్యుత్తును కూడా వినియోగించుకోవాలనే లక్ష్యంతో బీఈఎస్ఎస్ ను ఏర్పాటు చేశారు.
మందమర్రి ప్లాంట్‌లో జనవరి నెలలో బీఈఎస్ఎస్ ను ఏర్పాటు చేసినప్పటి నుండి, స్థానిక అవసరాలకు వినియోగించగా మిగిలిన 3,35,485 యూనిట్ల విద్యుత్తును నిల్వ చేసుకొని, అవసరమైన సందర్భాలలో వినియోగించుకుంది. దీని ద్వారా సింగరేణి సంస్థకు రూ. 25,66,460 ఆర్థిక లబ్ధి చేకూరింది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సింగరేణి యాజమాన్యం సంసిద్ధత వ్యక్తం చేసింది.










