Mancherial/Jaipur (అక్షరవేకువ) జూలై 17
రోడ్డు ప్రమాదానికి కారణమై, ఆపకుండా వెళ్లిపోయిన (హిట్ అండ్ రన్) కేసులో జైపూర్ పోలీసులు ఆర్టీసీ బస్సును, దాని డ్రైవర్ను గుర్తించారు. హోంగార్డు లక్ష్మణ్ మృతికి కారణమైన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టి, సీసీటీవీ ఆధారాలతో వాహనాన్ని, నిందితుడిని పట్టుకున్నారు.
రోడ్డు ప్రమాదానికి కారణమై, ఆపకుండా వెళ్లిపోయిన (హిట్ అండ్ రన్) కేసులో ఆర్టీసీ బస్సును, దాని డ్రైవర్ను జైపూర్ పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రామగుండం కమిషనరేట్లో హోంగార్డుగా పనిచేస్తున్న లక్ష్మణ్ ఈ నెల 11వ తేదీ రాత్రి విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, నజీర్పల్లి పైవంతెన వద్ద ఒక వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు.
ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ భూమేష్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటయింది. ప్రమాద స్థలంలోని సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అది ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు TS20 Z 0012 అని తేలింది.
బస్సు డ్రైవర్, బెజ్జూర్కు చెందిన జంగిటి రాజేశాన్ని పోలీసులు గుర్తించి విచారించగా, ఆయన తన తప్పిదాన్ని అంగీకరించినట్లు ఎస్ఐ భూమేష్ తెలిపారు.












