నేషనల్ హైవే 63 భూసేకరణ విషయంలో అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ గుడిపేట గ్రామంలో రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ భూములను కాపాడుకోవడానికి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వ విధానాలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామాల్లోని గ్రామ పంచాయతీలలో తీర్మానాలు చేయించాలని, అందుకు బాధిత రైతులు గ్రామ పంచాయతీ అధికారులకు, సర్పంచులకు వినతిపత్రాలు సమర్పించాలని సూచించారు. కార్పొరేషన్ గ్రామాల పరిధిలోని రైతులు మంచిర్యాల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతిపత్రాలు సమర్పించి, పూర్వపు రోడ్డు ప్రకారమే నిర్మాణం జరగాలని, అందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేయాలని సూచించారు. ఆంధ్ర కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ వెళ్లి అలైన్మెంట్ మార్చడం వల్లే వందలాది మంది రైతుల బ్రతుకులు ఆగమయ్యాయని, దీనికి కాంగ్రెస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గతంలో రైతులతో మాట్లాడుతూ, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ రోడ్డు మాత్రం రైతుల భూముల్లో నుంచి వేయించను అని పలికారు. మరి ఎమ్మెల్యే గారు ఇప్పుడు అధికారుల చర్యలను ఎందుకు అడ్డుకోవడం లేదని రైతులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రాణం పోయినా అనే మాట మీ ప్రయోజనాల కోసమా లేక రైతుల ప్రయోజనాల కోసమా అనేది అందరికీ అనుమానం కలిగిస్తున్న ప్రశ్న. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది. పార్లమెంట్ సభ్యుడు వంశీ, దున్నపోతు మీద వాన పడ్డట్టుగా రైతులు ఇంత ఆందోళన చెందుతున్నా కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం మీ అహంకారానికి నిదర్శనమని భావిస్తున్నాం. ఇప్పటికైనా వంశీ దళారుల పక్షాన నిలబడతారా లేక రైతుల పక్షాన నిలబడతారా అనేది తేటతెల్లం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. రైతుల పట్ల మీ మౌనం చూస్తుంటే, కచ్చితంగా మీరు బ్రోకర్లకు, దళారులకు, ఆంధ్ర పెట్టుబడిదారులకు అండగా ఉన్నారని భావించాల్సి వస్తుందని అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ కి గానీ, మీకు గానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తండ్రీకొడుకులు ఇద్దరూ వెంటనే నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి, గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ను 2023 బ్రౌన్ఫీల్డ్ ప్రకారం మార్చి, రైతుల పక్షాన నిలబడి మీ నిజాయితీని, చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కచ్చితంగా మీరు రైతు ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రైతు నాయకుడు లగిశెట్టి రాజమౌళి మాట్లాడుతూ, ప్రొద్దున్న లేస్తే రాజ్యాంగం ఖూనీ అవుతోందని మాట్లాడే కాంగ్రెస్ నేతలకు, తమ బ్రతుకులు ఆగమవుతున్నవి కనిపించడం లేదని అన్నారు. తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి హైదరాబాద్లోని గాంధీ భవన్ వరకు, అక్కడి నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వరకు తీసుకెళ్లి, రైతుల పట్ల కాంగ్రెస్ కి ఉన్న చిత్తశుద్ధి ఏ తో సమానమని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తామని హెచ్చరించారు.










