మంచిర్యాల డివిజన్, హాజీపూర్ మండలంలో సహజ వ్యవసాయం మరియు జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సహజ వ్యవసాయ పద్ధతులు, వర్షాభావ పరిస్థితుల్లో పంటల ఎంపికపై మార్గనిర్దేశం చేశారు.
హాజీపూర్ గ్రామంలో 19.06.2026న నిర్వహించిన ఈ కార్యక్రమంలో, సహజ వ్యవసాయం పశుపోషణతో ఎలా ముడిపడి ఉంటుందో వివరించారు. బీజామృతం, జీవామృతం వంటి పొలంలోనే తయారుచేసుకునే పద్ధతులు, బహుళ పంటల సాగు గురించి రైతులకు తెలియజేశారు.
El Nino ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి, రైతులు కనీసం 50-60 మిల్లీమీటర్ల వర్షపాతం తర్వాత, 3-4 రోజుల పాటు వర్షం కురిసిన తర్వాతే విత్తనాలు నాటాలని సూచనలు ఇచ్చారు.
వర్షాభావ పరిస్థితుల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన పప్పుదినుసులు, మెట్ట పంటలైన జొన్నలను సాగు చేయాలని, పంటల మార్పిడిలో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ADA మంచిర్యాల మామిడి క్రిష్ణ, వ్యవసాయ అధికారి హాజీపూర్ క్రిష్ణ, AEO మధుప, కృషి సఖి స్వప్న, మరియు పలువురు సేంద్రీయ వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.











