మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ధాన్యం కొనుగోళ్లలో అవినీతికి పాల్పడుతున్నారని, రైతులను దోచుకుంటున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. లక్షెట్టిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు.
రైతులు పండించిన పంటను తరుగు పేరుతో బస్తాకు 3.5 కిలోలు కట్ చేస్తున్నారని, దీనివల్ల క్వింటాల్‌కు 100 రూపాయలు నష్టం వాటిల్లుతోందని దివాకర్ రావు తెలిపారు. ఈ డబ్బులు ఎమ్మెల్యే జేబుల్లోకి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు.
రవాణా ఖర్చుల పేరుతో కూడా రైతుల నుండి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని, దీనివల్ల క్వింటాల్‌కు 25 రూపాయల వరకు నష్టం వస్తోందని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం కూడా సకాలంలో తరలించకపోవడంతో వర్షాలకు తడిసిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక బస్తాకు మూడు కిలోల చొప్పున కట్ చేస్తున్న డబ్బు అంతా కలిపి దాదాపు 25 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొందరు రైతులు మరణించారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు లేవని ఆయన గుర్తు చేశారు.
మంచిర్యాల జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ఇప్పటివరకు సగం కూడా కొనుగోలు చేయలేదని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే కొనుగోళ్లలో పూర్తిగా విఫలమయ్యారని, అసెంబ్లీలో చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. వర్షాలకు తడిసిన పంటలను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.








