రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే డీలర్లపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ స్పష్టం చేశారు. గురువారం గుడిపేట గ్రామంలోని రైతు వేదికలో విత్తనాలు, ఎరువుల డీలర్లకు నకిలీ విత్తనాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొని, డీలర్లు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామని, తయారీదారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.
డీలర్లు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని, స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్‌లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు ఇచ్చే బిల్లులపై వారి సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మరాదని ఆదేశించారు.
సోర్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచాలని, గడువు ముగిసిన విత్తనాలను విక్రయించరాదని హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్‌లను మండల వ్యవసాయ అధికారిచే అటెస్టేషన్ చేయించుకోవాలని, క్రమం తప్పకుండా స్టాక్ రిపోర్టులను సమర్పించాలని సూచించారు.












