కర్ణాటకలో ప్రభుత్వ బస్సు ఛార్జీలు, నందిని పాల ధరలు పెరిగాయి. బెంగళూరు మహానగర రవాణా సంస్థ (బీఎంటీసీ), కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) ఛార్జీలను సగటున 23 నుంచి 35 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది.
రాష్ట్రంలో ప్రభుత్వ బస్సు ప్రయాణ ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో సగటున 23 శాతం, బీఎంటీసీ బస్సుల్లో 33 నుంచి 35 శాతం వరకు ఛార్జీలు పెరిగాయి. బెంగళూరు నగరంలో సాధారణ బస్సుల కనీస టికెట్ ధర రూ.6 నుంచి రూ.10కి, గరిష్ఠ ధర రూ.35 నుంచి రూ.45కి చేరింది. అలాగే, ఏసీ వజ్ర బస్సుల గరిష్ఠ ఛార్జీ రూ.75 నుంచి రూ.90కి, విమానాశ్రయానికి వెళ్లే వాయు వజ్ర బస్సుల గరిష్ఠ టికెట్ ధర రూ.405 నుంచి రూ.425కి పెరిగింది. ఈ పెంపుతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పెరిగిన డీజిల్ ధరలు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులను కారణంగా చూపుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు ప్రభుత్వ రవాణా సంస్థలు సుమారు రూ.10,200 కోట్ల నష్టాల్లో ఉన్నాయని రవాణా మంత్రి బైరతి సురేశ్ తెలిపారు. గతంలో 2025లో కూడా బస్సు ఛార్జీలను 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, నందిని పాల ధర కూడా లీటరుకు రూ.8 పెరిగింది. దీంతో పాటు ఇతర నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగింది. అయితే, కర్ణాటక మహిళలకు శక్తి పథకం కింద సాధారణ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపశమనం లభించనుంది.



