సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ తన కుటుంబమే అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన గణపతి నిమజ్జన వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైతన్య యువజన సంఘం ఏర్పాటు చేసిన వినాయక లడ్డూ వేలంలో రూ. 21 లక్షలు పెట్టి లడ్డూను దక్కించుకున్నారు.
సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ తన కుటుంబమే అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన గణపతి నిమజ్జన వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబం అంటే కేవలం భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు మాత్రమే కాదని, సంగారెడ్డి ప్రజలందరూ తన కుటుంబ సభ్యులేనని ఆయన స్పష్టం చేశారు. సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ వద్ద చైతన్య యువజన సంఘం ఏర్పాటు చేసిన వినాయక లడ్డూ వేలంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ వేలం పాటలో ఆయన రూ. 21 లక్షలు పెట్టి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. సంగారెడ్డి ప్రజలందరి తరపున ఈ వేలంపాట పాడానని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా తన ఆధ్వర్యంలో పండుగలు జరుగుతాయని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రజలంతా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడం తనకు మరింత ఆనందాన్నిచ్చిందని ఆయన వెల్లడించారు. వేలం పాటలో దక్కిన లడ్డూను అక్కడికక్కడే తన కుటుంబ సభ్యుల ద్వారా అందరికీ పంచిపెట్టారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు సంగారెడ్డిలో జరిగిన నిమజ్జన వేడుకలను ఆయన పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు. కింది బజార్ చెరువు వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్ల ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా, అక్కడి పరిస్థితిని ఆయన సమీక్షించారు. విగ్రహాల ఊరేగింపులో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జగ్గారెడ్డి స్వయంగా ఆటోలో, కాలినడకన తిరుగుతూ తనదైన శైలిలో ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఆయన చురుకైన పర్యవేక్షణతో నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగాయి.











