మండలంలోని రామారావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామసభ నిర్వహించి, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం పెంపొందించే లక్ష్యంతో జీపీపీఎఫ్టీ, జీపీసీసీ కమిటీలను ఏర్పాటు చేశారు.
గ్రామసభకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, యువత, రైతులు, అధికారులు హాజరయ్యారు. సర్పంచ్ పులి రాజశేఖర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు గ్రామస్థుల భాగస్వామ్యం అవసరమని, ఈ కమిటీలు గ్రామ అవసరాలను గుర్తించి ప్రణాళికలను రూపొందిస్తాయని తెలిపారు.
మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు మాట్లాడుతూ, రామారావుపేట, ముదిగుంట గ్రామాలు నాణ్యమైన జీపీడీపీ తయారీకి ఎంపికయ్యాయని, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఈ కమిటీలు దోహదపడతాయని వివరించారు.
పంచాయతీ కార్యదర్శి డి. రజిత ఘన వ్యర్థాల నిర్వహణలో '4-బిన్ విధానాన్ని' పాటించాలని కోరారు. తడి, పొడి, ప్రమాదకర, పారిశుద్ధ్య వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం ద్వారా గ్రామ పరిశుభ్రతను కాపాడవచ్చని ఆమె సూచించారు.
సమావేశం చివరలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నియంత్రణపై స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. గ్రామస్థుల ఆమోదంతో కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది.












