రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి మండలంలో, అర్జునగుట్ట గ్రామంలో గుడుంబా తయారీపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, 35 లీటర్ల నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.
కోటపల్లి పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు అర్జునగుట్ట గ్రామంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో మొత్తం 35 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 300 లీటర్ల బెల్లపు పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. తయారీ సామగ్రిని కూడా సీజ్ చేశారు.
ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆకుదారి అనిల్ (20), అట్టేలా మల్లయ్య (62), ఆకుదారి సదువలి (40) అనే ముగ్గురిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరిలో ఆకుదారి అనిల్ నుంచి 10 లీటర్ల గుడుంబా, అట్టేలా మల్లయ్య నుంచి 15 లీటర్లు, ఆకుదారి సదువలి నుంచి 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కోటపల్లి ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ, గ్రామాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడుంబా వంటి అక్రమ కార్యకలాపాలు కుటుంబాలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతీస్తున్నాయని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇలాంటి కార్యకలాపాలను నిర్మూలించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ ఆపరేషన్లో హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు, టీజీఎస్పీ కానిస్టేబుళ్లు మల్లేష్, సాయికృష్ణ, నరేష్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.







