ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
నెలవారీ నేర సమీక్షా సమావేశంలో భాగంగా, ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దర్యాప్తులో నాణ్యత, పెండింగ్ కేసుల పరిష్కారం, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజా భద్రత, సైబర్ నేరాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్ అవగాహన కార్యక్రమాలపై కీలక సూచనలు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్గ్రేవ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల పురోగతిని ఎస్పీ సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి అధికారులను ఆదేశించారు. లాంగ్ పెండింగ్ కేసులు, మిస్సింగ్ కేసుల ఛేదన, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని, నిర్ణీత గడువులోగా కేసులను పరిష్కరించాలని సూచించారు. గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారాలను సేకరించి, నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టాలని అన్నారు. నిజమైన దోషులకు న్యాయస్థానంలో శిక్ష పడినప్పుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. దర్యాప్తులో సాంకేతిక, న్యాయపరమైన సందేహాలు తలెత్తినప్పుడు ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు సత్యయ్యగౌడ్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, వర్తికల్ డిఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ సురేందర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బి ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.












