రైతులను మోసం చేసేందుకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మందమర్రి మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, సిబ్బందితో కలిసి పోలీసులు శనివారం ఉదయం NH-363, అందుగులపేట్ శ్రీ కన్వెన్షన్ హాల్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా రెండు బైక్‌లపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి విచారించగా, నకిలీ విత్తనాల విక్రయానికి సంబంధించిన విషయం బయటపడింది.
అరెస్ట్ అయిన నిందితులుగా మాకినేని రాఘవేంద్ర, కట్ట నరేష్, పుట్టగంటి పవన్ కుమార్ లను గుర్తించారు. వీరి వద్ద ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని 100 కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రవాణాకు ఉపయోగించిన అపాచీ, టీవీఎస్ బైక్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అమాయక రైతులకు నష్టం కలిగించే ఇలాంటి అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని వారు తెలిపారు.











