మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భీమారం, చెన్నూర్ మండలాల్లో ఏకకాలంలో జరిపిన దాడుల్లో సుమారు 386 కేజీల నిషేధిత HT.BT3 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డీసీపీ ఏ.భాస్కర్ IPS వెల్లడించారు.
ఐదుగురు సభ్యులున్న ఈ ముఠా ఆంధ్ర ప్రాంతం నుండి నిషేధిత HT..BT3 రకం నకిలీ పత్తి విత్తనాలను తెప్పించి, మంచిర్యాల జిల్లాలోని భీమారం, చెన్నూర్ మండలాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. నమ్మదగిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 386 కేజీల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. నకిలీ విత్తనాల వాడకం వల్ల భూసారం తగ్గిపోయి, పంట నష్టంతో పాటు పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని డీసీపీ హెచ్చరించారు.
రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, ప్రభుత్వ లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాల విక్రయంపై తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నిందితులపై పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా IPS ఆదేశాల మేరకు, ఈ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన భీమారం ఎస్సై ఎ.రాజేందర్, హెడ్ కానిస్టేబుల్ పి.మల్లయ్య, కానిస్టేబుళ్లు ఎన్.మహేందర్, యువరాజ్, ఎన్.అశోక్ మరియు హోంగార్డులు సదాశివ్, సంతోష్, శ్యామ్లను డీసీపీ ఏ.భాస్కర్ IPS అభినందించారు. వీరికి త్వరలో రివార్డులు అందజేస్తామని ప్రకటించారు.












