సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల సాయిబాబా ఆలయం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రజతోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా జరిగిన శిఖర కుంభాభిషేకంలో నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు.
సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న సాయిబాబా ఆలయం స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మూడు రోజుల పాటు రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ పర్యవేక్షణలో, జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డిల సహకారంతో ఈ కార్యక్రమాలు జరిగాయి. కూకట్పల్లికి చెందిన నరేష్ పంతులు నేతృత్వంలో 30 మంది వేద పండితులు యజ్ఞయాగాదులు, కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొదటి రోజు సుదర్శన యాగం, రెండో రోజు శత కలశాభిషేకం, మూడో రోజు శిఖర కుంభాభిషేకం వంటివి జరిగాయి.
వేద మంత్రోచ్చారణల నడుమ జరిగిన పూజలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. మూడో రోజు జరిగిన శిఖర కుంభాభిషేకంలో నిర్మల జగ్గారెడ్డి పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్యులు టి. కాశప్ప, కేవీ నర్సయ్య, ఎస్. వీరేందర్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












