ఆసియాలోని అగ్రశ్రేణి విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ హైదరాబాద్ మరోసారి తన సత్తా చాటింది. క్యూఎస్ () వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో భాగంగా విడుదలైన ఆసియా విభాగం ర్యాంకింగ్స్‌లో ఈ సంస్థ 19 స్థానాలు మెరుగుపరుచుకుని 251వ ర్యాంకును కైవసం చేసుకుంది. గత ఏడాది 270వ స్థానంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్, ఈసారి గణనీయమైన పురోగతి సాధించింది.
పరిశోధనా ఉత్పాదకత, అధ్యాపకుల అర్హతలు, విద్యా ప్రతిష్ఠ వంటి కీలక అంశాల్లో మెరుగైన పనితీరు కనబరచడం ద్వారా ఐఐటీ హైదరాబాద్ ఈ ఘనతను సాధించింది. తాజా ర్యాంకింగ్స్‌లో, సంస్థ అధిగమించిన విద్యాసంస్థల శాతం 82.5 నుంచి 85.5కు పెరిగింది. సాంకేతిక విద్య, డీప్‌టెక్ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు ఐఐటీ హైదరాబాద్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు, పరిశోధకులు తమ ఆలోచనలను పేటెంట్లుగా మార్చుకోవడానికి, సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలుగా అభివృద్ధి చేయడానికి సంస్థ ప్రోత్సాహం అందిస్తోంది. ఈ విజయంపై సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి స్పందిస్తూ, ఇది అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, సిబ్బంది అందరి సమష్టి కృషికి నిదర్శనమని అన్నారు. విద్య, పరిశోధనలను సాంకేతికత, ఆవిష్కరణలు, వాస్తవ సమస్యల పరిష్కారాలతో అనుసంధానిస్తూ సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. 2008లో స్థాపించబడిన ఐఐటీ హైదరాబాద్, అతి తక్కువ కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఎన్ఐఆర్ఎఫ్2025 ర్యాంకింగ్స్‌లో ఇంజినీరింగ్ విభాగంలో ఏడో స్థానం, ఇన్నోవేషన్ విభాగంలో ఆరో స్థానం సాధించింది. క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్2027లో 588వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌లో 6,110 మందికి పైగా విద్యార్థులు, 355 మందికి పైగా అధ్యాపకులు ఉన్నారు. ఇప్పటివరకు రూ.1,880 కోట్ల విలువైన 5,980కి పైగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. 850కి పైగా పేటెంట్లను కలిగి ఉండగా, 450కి పైగా పేటెంట్లకు అనుమతులు పొందింది. అంతేకాకుండా, 300కు పైగా స్టార్టప్‌ల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించింది. పరిశోధనలు, ఆవిష్కరణలు, నూతన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో నిరంతరం ముందుకు సాగుతూ, ఐఐటీ హైదరాబాద్ దేశ విద్యారంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.


