సంగారెడ్డి, 2026-08-31
సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించి, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధించేందుకు విద్య ఒక్కటే ప్రధాన మార్గమని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లో సంచార జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించి, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధించేందుకు విద్య ఒక్కటే ప్రధాన మార్గమని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్ పాండు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, మనుషులను కులాలు, జాతుల పేరుతో విభజించి చూడకుండా ప్రతి ఒక్కరూ సమానంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కులం, జాతి, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మనిషి తన ఆశయానికి అనుగుణంగా ఉన్నత హోదాలను సాధించడానికి విద్య ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సంచార జాతులు, వెనుకబడిన తరగతులకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులు, సామాజిక వెనుకబాటుతనాన్ని అధిగమించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్యే శాశ్వతమైన మార్గమని అన్నారు. చదువు ఒక్కటే అభివృద్ధికి పరిష్కారం అనే విషయాన్ని ప్రతి కుటుంబం గుర్తించాలని పిలుపునిచ్చారు.
సంచార జాతులు, విముక్త జాతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు వివరించారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ఎంబీసీ జిల్లా అధ్యక్షుడు హనుమంతు, ఎంబీసీ సంచార జాతుల కార్యదర్శి వినోద్, వీరభద్రుల కులాల అధ్యక్షులు అలుగు మల్లేశం, జంగమ ఎంబీసీ రాష్ట్ర కార్యదర్శి వీరేశం, వీరభద్రుల కులాల జిల్లా అధ్యక్షులు మోహన్ బాబు, ఎంబీసీ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్‌తో పాటు వివిధ కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










