మందమర్రి పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఇటీవల జరిగిన పిఎంశ్రీ తెలంగాణ మోడల్ పాఠశాల ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, సీట్లు సాధించారు.
పిఎంశ్రీ తెలంగాణ మోడల్ పాఠశాలల్లో 6 నుండి 12 తరగతుల వరకు విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ పాఠశాల నుండి ఆరుగురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి, తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్య శ్రీనివాస చారి మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల అంకితభావంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన విద్యాబోధన అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించి విద్యను అందించే బదులు, ప్రభుత్వ పాఠశాలల్లో లభించే నాణ్యమైన విద్యతో పాటు మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలు పొందడం ఒక శుభపరిణామమని పలువురు అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచుతుందని వారు తెలిపారు.
ఎంపికైన విద్యార్థులకు, వారికి సహకరించిన ఉపాధ్యాయులకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వైద్య శ్రీనివాస చారితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.








