భీమారం మరియు పరిసర గ్రామాల ప్రజలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యధికారి వంశీకృష్ణ సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని ఆయన తెలిపారు.
బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు లేదా తలపై తెల్లని వస్త్రాలు, టోపీ ధరించాలని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నీరు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొన్నారు. శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, వాటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తెలిపారు.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున, ఈ సమయంలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, కావున ప్రజలు ఈ సమయంలో బయటకు రావద్దని సూచించారు.
ఒకవేళ ఎవరైనా వడదెబ్బ బారిన పడితే, వారికి వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం తాగించి, సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించాలని వైద్యధికారి సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి తాపాన్ని తట్టుకోవచ్చని ఆయన తెలిపారు.











