జిల్లాలో డెంగ్యూ వ్యాధి నివారణపై అవగాహన కల్పించేందుకు, 16వ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన డెంగ్యూ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు, ప్రజలకు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ మాట్లాడుతూ, కీటక జనిత వ్యాధుల నిర్మూలనకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమలు ప్రజా ఆరోగ్యానికి ముప్పు తెస్తాయని, వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు.
ఇళ్లలో, పరిసరాలలో దోమలు పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన నొక్కి చెప్పారు. డెంగ్యూ జ్వరం లక్షణాలైన తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, దద్దుర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, జిల్లా ఆసుపత్రులలో పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని తెలిపారు.
దోమల నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని, ఇంటిలో, ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారానికి ఒకసారి 'డ్రైడే' పాటించాలని సూచించారు. పనికిరాని వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, మురికి కాలువలను శుభ్రం చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారుల సహకారంతో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు డెంగ్యూ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖా అధికారిణి డాక్టర్ ఎస్. అనిత, రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ రవి కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.












