అంతర్జాతీయ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సుధాకర్ నాయక్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. తలసేమియా ఒక వంశపారంపర్య రక్త సంబంధిత వ్యాధి అని, సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా నివారించవచ్చని ఆయన తెలిపారు. వివాహానికి ముందు రక్తపరీక్షలు చేసుకోవడం అత్యవసరమని సూచించారు.
తలసేమియా బాధిత పిల్లలకు నిరంతర రక్త మార్పిడి అవసరమని, దీనికోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని డా. సుధాకర్ నాయక్ పిలుపునిచ్చారు. ప్రజల్లో సరైన అవగాహన పెంపొందిస్తే ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
తల్లిదండ్రులు, యువత ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, వైద్యుల సూచనలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. అరుణ శ్రీ, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆర్ ఎం ఓ డా. శ్రీమన్నారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పుట్ట సత్తయ్య, తలసేమియా సికిల్ సెల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












