మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 10
జిల్లా కేంద్రానికి రూట్ కనెక్టివిటీతో మహర్దశ పట్టనుంది.
జిల్లా కేంద్రానికి రూట్ కనెక్టివిటీతో మహర్దశ పట్టనుంది. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో రహదారులు, వంతెనల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే పట్టణ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.
మంగళవారం పట్టణంలోని రాళ్లవాగు రూట్ కనెక్టివిటీ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆండాలమ్మ కాలనీ, గ్రీన్ సిటీ, పవర్ సిటీ, లక్ష్మీనగర్, ఏసీసీ క్వారీ, రంగంపేట, పాత ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
రహదారుల నిర్మాణం వివరాలు
ఏసీసీ చౌరస్తా నుంచి దర్గా వరకు ఫోర్ లైన్ రహదారి, అక్కడి నుంచి పాత వరకు సిక్స్ లైన్ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. రాళ్లవాగుపై సుమారు రూ.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి, ఆయా ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ రూట్ కనెక్టివిటీతో ఐటీ పార్కు విస్తరణకు మార్గం సుగమం కానుందని, ఐటీ కారిడార్‌కు 100 అడుగుల రహదారి సౌకర్యం కల్పించే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఫోర్ లైన్, సిక్స్ లైన్ రహదారులతో పట్టణంలోని వివిధ ప్రాంతాలకు కేవలం ఐదు నిమిషాల్లో చేరుకునేలా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు.
మొత్తం రూ.250 కోట్లలో రూ.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం, రూ.200 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రెండేళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేసి రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.







