అరేబియా సముద్రంలో సోమాలి సముద్ర దొంగల చెరలో చిక్కుకున్న 20 మంది నావికులను భారత నౌకాదళం సురక్షితంగా రక్షించింది. 48 గంటలకు పైగా సాగిన ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ చర్యలో భారత వైమానిక దళం కూడా కీలకంగా సహకరించింది.
నావికులందరినీ ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు లేకుండా కాపాడినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. అజినీ అనే చేపల వేట నౌకను సోమాలియా ఈశాన్య తీరంలో సాయుధ సముద్ర దొంగలు స్వాధీనం చేసుకున్నారు. నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్న దొంగలు.. వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగించే తల్లి నౌకగా మార్చే అవకాశం ఉందని సముద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి.
48 గంటల ప్రత్యేక ఆపరేషన్
దీంతో భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఈ నౌకను గుర్తించేందుకు భారత నౌకాదళం ఒక యుద్ధనౌకతో పాటు సముద్ర నిఘా విమానాన్ని రంగంలోకి దించింది. నిరంతర నిఘా ద్వారా నౌక కదలికలను గుర్తించి, దాని ప్రయాణాన్ని నియంత్రించే చర్యలు చేపట్టింది.
అనంతరం భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం ద్వారా మెరైన్ కమాండోలను కచ్చితమైన ప్రణాళికతో అక్కడికి చేర్చారు. నౌకాదళ సిబ్బంది సమన్వయంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యలో సముద్ర దొంగల ముప్పును అధిగమించి నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో ఉన్న 20 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
రక్షణ మంత్రి అభినందనలు
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత నౌకాదళాన్ని అభినందించారు. సముద్రంలో సుదూర ప్రాంతాల్లోనూ ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఈ చర్య మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. భారత వైమానిక దళం అందించిన సహకారాన్ని కూడా ప్రశంసించారు.












