జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకం కింద మంచిర్యాల డివిజన్ స్థాయి రైతు శిక్షణ కార్యక్రమం మంగళవారం లక్షెట్టిపేట రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ అధికారులు, ప్రముఖులు పాల్గొని ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకతను వివరించారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి ఎఫ్ పి ఓ హాజీపూర్ డైరెక్టర్ పుష్కూరి శ్రీనివాసరావు, సేంద్రియ రైతు ప్రముఖ న్యాయవాది కే.వీ ప్రతాప్, మ్యాక్స్ ప్రెసిడెంట్ సారం మధుకర్, సెక్రటరీ రవీందర్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు మామిడి కృష్ణ హాజరయ్యారు.
రైతుల ఎంపిక మరియు సంసిద్ధత
మంచిర్యాల్ డివిజన్ పరిధిలో హాజీపూర్, లక్షెట్టిపేట, జన్నారం మండలాలకు ఒక క్లస్టర్‌కు 125 మంది రైతులను, దండేపల్లి మండలంలో రెండు క్లస్టర్లకు చొప్పున 1225 మంది చొప్పున మొత్తం 250 మంది రైతులను ఎంపిక చేసి ప్రకృతి వ్యవసాయం చేయడానికి సంసిద్ధం చేస్తున్నారు.
శిక్షణలో అంశాలు
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాల్సిన ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలు, వివిధ రకాల సేంద్రియ వనరులైన జీవామృతాలు, కషాయాల తయారీ మరియు వినియోగ విధానంపై అవగాహన కల్పించారు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే రైతుల అనుభవాలను కూడా వారు ఇతర రైతులతో పంచుకున్నారు.
హాజరైన రైతులు, అధికారులు
ఈ కార్యక్రమంలో హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల నుండి ప్రకృతి సేద్యం కోసం ఎంపికైన రైతులు, మండల వ్యవసాయ అధికారులు, లక్షెట్టిపేట, జన్నారం, హాజీపూర్ వ్యవసాయ విస్తరణ అధికారులు హాజరయ్యారు.












