మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 13
ఎన్ హెచ్ 63 గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులు ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకున్న కొద్దిపాటి భూమిని తీసుకోకుంటే బతుకులు ఆగమైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం రైతులు సమావేశమయ్యారు. ఎన్ హెచ్ 63 గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులందరూ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును కలిశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ భూములు తీసుకోవద్దని, ఇంతకుముందు ఎల్లంపల్లి ప్రాజెక్టులో సర్వం కోల్పోయామని, ఇప్పుడు కూడా గ్రీన్ ఫీల్డ్ 63 కింద తమకున్న కొద్దిపాటి భూమిని తీసుకుంటే తమ బ్రతుకులు ఆగమైపోతాయని లక్షెట్టిపేట్, హాజీపూర్ మండలాలకు చెందిన 150 మంది రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, ఎన్ హెచ్ 63 గ్రీన్ ఫీల్డ్ లో రైతుల భూములు కోల్పోనివ్వనని, రైతులకు అండగా ఉంటానని మాట ఇచ్చి భరోసా కల్పించారు. రైతుల సమక్షంలోనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, రైతులను ఇబ్బంది పెట్టవద్దని, నోటీసులు నిలిపివేయాలని, ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి గ్రామ సభకు తాను హాజరవుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
రైతులందరికీ తానున్నానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. రైతులందరూ ప్రేమ్ సాగర్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు.












