మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమని మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వ్యక్తిగత విమర్శలకు బదులు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
మాజీ సీడీసీ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామప్ప, కౌన్సిలర్లు పొన్న రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు అసలు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విమర్శలు, అనవసర ఆరోపణలకు బదులుగా సంగారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడితే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆయన సూచించారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డుపై ప్రతిరోజూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాజీ ఎమ్మెల్యేకు తెలియవా అని ఆయన ప్రశ్నించారు. గుంతలు, ట్రాఫిక్ సమస్యలు, నెమ్మదిగా సాగుతున్న పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బైపాస్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలన్నదే ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ అని విజేందర్ రెడ్డి అన్నారు. అయితే, 50 అడుగుల రోడ్డుతో సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందా లేక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 80 అడుగుల రోడ్డు ఉన్న చోట 80 అడుగులు, 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డును నిర్మించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలా అనేది ప్రజలే ఆలోచించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే: ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు నిర్మాణం జరగాలని, భవిష్యత్లో మళ్లీ రోడ్డు విస్తరణ అవసరం రాకుండా ఇప్పుడే సరైన ప్రణాళికతో పని పూర్తి చేయాలని అన్నారు. ఈ విషయంలో ప్రజల అభిప్రాయం తీసుకోవడం అవసరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు రామప్ప, కౌన్సిలర్లు లాడే మల్లేశం, నవీన్, సురేష్, కసిని శ్రీకాంత్, విఠల్, వజిత్ తదితరులు పాల్గొన్నారు.












