జిల్లా తలమడుగు మండలంలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. తన పంట దిగుబడిపై ఆందోళనతో పాటు, కుమార్తెల వివాహాల కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడు.
తలమడుగు మండలానికి చెందిన కాడే లస్మన్న (65) అనే రైతు తన రెండున్నర ఎకరాలలో పత్తి పంట సాగు చేశాడు. అయితే, సరైన వర్షాలు కురవకపోవడంతో పంట దిగుబడిపై తీవ్ర ఆందోళన చెందాడు. ఈ నేపథ్యంలో, తన ముగ్గురు కుమార్తెల వివాహాల కోసం తీసుకున్న సుమారు 3 లక్షల అప్పు, మహారాష్ట్ర బ్యాంకులో ఉన్న 2 లక్షల పంట ఋణం తో కలిపి మొత్తం రూ. 5 లక్షల అప్పుల భారంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
పొలానికి వెళ్లి వస్తానని చెప్పి...
అప్పుల భారంతో కుంగిపోయిన కాడే లస్మన్న, తన భార్యతో కలిసి పొలానికి వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరాడు. పొలం వద్దకు చేరుకున్నాక, అక్కడే ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












