సంగారెడ్డిలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికుల ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయు) సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్ష పదవికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ టీడబ్ల్యూయుకు మద్దతు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అనంత కిషన్ మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు టీజేఎంయు సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ కార్మికుల ఎన్నికల్లో టీడబ్ల్యూయు అభ్యర్థుల విజయానికి శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా కార్మికుల ప్రయోజనాల కోసం టీడబ్ల్యూయుకు మద్దతుగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.










