మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎంపీ వంశీ, ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. వర్గాల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో, మంచిర్యాల నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి వివేక్, ఎంపీ వంశీల పర్యటనలు అంతంత మాత్రంగానే సాగాయి. గత రెండు నెలలుగా పరిస్థితుల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో మంచిర్యాల అసెంబ్లీలో పెద్ద కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు వచ్చినా, ఎంపీ వంశీ, మంత్రి వివేక్ పిలుపు లేని కారణంగా రాలేదని ప్రజల అభిప్రాయంగా ఉండేది. మంచిర్యాలలోని లక్సెట్టిపేట ఆసుపత్రుల శంకుస్థాపనతో పాటు పలు కార్యక్రమాల్లో ఎంపీ వంశీ, మంత్రి వివేక్ అంతంత మాత్రంగానే పాల్గొన్నారు. ఈ క్రమంలో దండ పెళ్లిలో పరామర్శకు మంత్రి వివేక్ వెళ్లగా, ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. తనపై వ్యతిరేకతతో మంత్రిని కలిసి పార్టీ సమస్యలు చెప్పుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో గూడెంలో ఎంపీ వంశీ కాన్వాయ్‌కు కారు అడ్డుపెట్టడం, సమావేశ ప్రాంగణంలోని ఫ్లెక్సీలను చించివేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా, ఎమ్మెల్యే వర్గ అనుచరుడు జగన్మోహన్రావు రాజకీయ, ఆర్థిక కారణాలతో దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల 9 మంది కార్పొరేటర్లు, 3 కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇద్దరు మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎంపీ వంశీ సమక్షంలో మంత్రి వివేక్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో మంచిర్యాల రాజకీయాల్లో వర్గ పోరు కుంపట్లు మొదలయ్యాయి. గత నెల రోజులుగా మంచిర్యాల రాజకీయాల్లో సునామీ వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య పోటీ పోటీగా ప్రెస్ మీట్లు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, కార్పొరేషన్లలో మహిళా కార్పొరేటర్ల మధ్య గందరగోళం, మేయర్‌పై తీవ్ర ఆరోపణలు, దూషణలు వంటివి చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలపై మంచిర్యాల రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తపరుస్తుండగా, యువత సోషల్ మీడియా, ఫేస్బుక్ వేదికగా సాక్ష్యాధారాలతో కూడిన వీడియోలను వైరల్ చేస్తోంది.










