విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పాత్రికేయులు తమ ఆరోగ్య పరిరక్షణకు తగిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
సన్రైజ్ ఆసుపత్రి సహకారంతో, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో బుధవారం సన్రైజ్ ఆసుపత్రిలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల సేవలు అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిడి, సమయాభావం కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆయన సూచించారు. జర్నలిస్టులు తమతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో వైద్య నిపుణులు ఉచిత వైద్య సంప్రదింపులు అందించారు. అవసరమైన వారికి ఈసీజీ, 2డీ ఎకో, రక్త పరీక్షలు నిర్వహించారు. గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, కీళ్లు, మధుమేహం, నాడీ సంబంధిత సమస్యలతో పాటు మహిళల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైజల్ అలీ, జిల్లా అధ్యక్షుడు బండారి యాదగిరి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ, సన్రైజ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ స్వామి గౌడ్, రథసారథి తెలుగు దినపత్రిక సంపాదకుడు సంతోష్ గౌడ్, జర్నలిస్టు సంఘాల నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు.












