సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో దసరా వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం పరిశీలించారు. 55 అడుగుల రావణాసురుడి బొమ్మ, బాణసంచా ప్రదర్శన స్థలాలను ఆయన పరిశీలించి, నిర్వాహకులకు సూచనలు చేశారు.
గత 30 ఏళ్లుగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ స్టేడియంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భారీ రావణాసురుడి బొమ్మ దహనం, బాణసంచా ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఏడాది కూడా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జగ్గారెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం, స్టేడియంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జగ్గారెడ్డి సూచించారు. ముళ్ల కంపలను తొలగించి, చెత్తాచెదారం లేకుండా మైదానాన్ని శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందికి, ఉత్సవ నిర్వాహకులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, భవాని యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బెస్త నగేష్, బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.










