సంగారెడ్డి జిల్లా మండలంలోని బద్రిగూడెం, ఉప్పరిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయాలను డీఎల్పీవో అనిత గురువారం తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వర్మీకంపోస్టు యూనిట్, నర్సరీ, వైకుంఠధామాలను సందర్శించి నిర్వహణను సమీక్షించారు.
ఈ సందర్భంగా డీఎల్పీవో అనిత మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, చెత్త నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. నర్సరీల్లోని మొక్కలను జాగ్రత్తగా సంరక్షిస్తూ, గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైకుంఠధామాల్లో పరిశుభ్రతతో పాటు ప్రజలకు అవసరమైన వసతులు అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామ అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీల్లో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.












